హైదరాబాద్, వెలుగు: పార్టీ కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనంలోకి సమర్థంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ ఆశిష్ షెలార్ సమక్షంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీ నాయకత్వానికి, వివిధ మోర్చాలకు మధ్య సమన్వయాన్ని మరింత పెంచడంపై లీడర్లు ప్రధానంగా చర్చించారు. రాబోయే ఎన్నికల కార్యక్రమాల్లో అన్ని మోర్చాలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు వివిధ మోర్చాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
